అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం

వ్యాలీ వేదిక, USA నిర్వహణలో...

మా గురించి

పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని, శతావధాని డాక్టర్. రాంభట్ల పార్వతీశ్వర శర్మ. “అవధాన సుధాకర”, “అవధాన భారతి”, “అవధాన భీమ”, "అవధానకిశోర", "అసమాన ధారణాధురీణ" "నవయువావధాని" "క్షేమేంద్ర సారస్వత సరస్వతి" “అవధానకేసరి” "అవధాన శేఖర", "శతావధాన కంఠీరవ" “శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ పద్యవిద్యలో ఆరితేరిన పండిత ప్రకాండులు. ఆశుకవితావిన్యాసంలో నిష్ణాతులు. వీరు అవధానవిద్యలో యువతకు ఆదర్శనీయులు. "అక్షరలక్ష" గాయత్రీ మహామంత్రోపాసకులు లక్ష్మీ నరసింహ సోమయాజులు, సూర్యకాంతకామేశ్వరి దంపతులకు 1988లో శ్రీకాకుళంలో జన్మించారు. వీరి తాతగారు పార్వతీశ్వర శర్మగారి నుండి అవధాన విద్యను అభ్యసించారు. వీరి కుటుంబమంతా కవులు, పండితులు, సాహితీవేత్తలే. తమ 16వ ఏటనే తెలుగు సాహిత్యంలో విశిష్టమైన “అష్టావధానాన్ని” చేసి అందరి మెప్పులు పొంది అందర్నీ ఆశ్చర్యపరిచిన దిట్ట. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 73 అష్టావధానాలు చేసి, మాడుగుల, గరికిపాటి, మేడసాని, నరాల, కడిమిళ్ళ, కోట, పాలపర్తి, వద్దిపర్తి, జి.ఎమ్. రామశర్మ వంటి అవధానదిగ్గజాల ప్రశంసలందుకున్న ప్రతిభామూర్తి. Degree వరకు చదువుకున్నది సైన్స్‌ అయినా... తెలుగులోనూ, సంస్కృతంలో ఎం.ఏ.లను పూర్తిచేసారు. ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో “U.G.C.” వారి “ఫెలోషిప్" తో ఆచార్యులు "అద్వైతసిద్ధిరత్నాకర" మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి గారి పర్యవేక్షణలో క్షేమేంద్రుడి "ఔచిత్య విచార చర్చ" మీద ప్రీతితో “తెలుగు ప్రాచీన పంచకావ్యాలు - ఔచిత్యం” అన్న పరిశోధనతో పీహెచ్‌ .డీ.ను పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టాను పొందారు. 2015, నవంబరులో... విశాఖ “కళాభారతి"లో మూడు రోజులపాటు “శతావధానం” చేసి సంచలనాత్మక రికార్డును సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా యువ కవి పండితుల్ని ఆశ్చర్య చకితుల్ని చేసారు. లెక్కకు మించిన ప్రసంగాలు... దూరదర్శన్‌ లోనూ, ఆకాశవాణిలోనూ వీరు నిర్వహించిన ఆశుకవితా ప్రదర్శనలు ప్రేక్షకులకు... సాహిత్య శ్రోతలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటాయి.

భారతభూమిలోనూ, అమెరికాలోనూ ఎన్నో బిరుదులు వీరిని వరించాయి. జాతీయ అవార్డులు. ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాలు, వివిధ విశ్వవిద్యాలయాల సన్మానాలు ఎన్నో అందుకున్నారు.. సాహిత్య రంగంలో తమ స్టాన్నాన్ని సుస్థిరం చేసుకున్న పార్వతీశ్వర శర్మ - ఆకాశవాణి "FM రెయిన్‌ బో" లో RJ శర్మగా ఉత్తరాంధ్ర శోతలకు సుపరిచితులు. శ్రీరాంభట్లవేంకటీయం, మొదటిమొగ్గలు, ప్రతిభాస్వరాలు, శతావధానభారతి మొ.నవి రచించారు. ప్రస్తుతం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం -- ఐఐఐటి శ్రీకాకుళంలో - తెలుగుశాఖలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు.


మీ స్పందన తెలియజేయండి

Reach us via Email or follow us on social icons below. Thank you.