అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం

వ్యాలీ వేదిక, USA నిర్వహణలో...

చిత్రాశువులు


1. ఆదిత్య ధవళ.

కోలనొక్కట మత్స్యమున్ కూలనేసి
బలపరీక్షను నెగ్గిన పార్థవరుడె
ఆలిగను పొందె నాడు పాంచాలసుతను;
కాంత గాదది వీరుని కాన్కయగును!


2. పిళ్ళా వేంకట రమణ మూర్తి.

జూచువేళల చిత్రాల వేచి వేచి
కొంత నిద్రించినంతనె కొసరు కెసరు!
పుస్తకమ్ములు చేతిలో పుచ్చుకొనిన
చివరి పుటనిల్చు చూడ - నీ చిత్రము వలె


3. యశ్వంత్ ఆలూరి.

కదలి పదములు పాటను కౌగిలించె
స్వర సుసప్తకమొక్కటై స్వాగతించె
లలిత పదముల నాథుడు "రామశాస్త్రి"!
కలితకీర్తివిభామతి కాడె? "బాలు"!


4. సీతామహాలక్ష్మి కాకాని.

ఉమ్మడి కుటుంబ మనగా
నమ్మయు నమ్మమ్మ గూడిర న్నయుచెల్లిన్
సమ్ముదమున వేడ్కన్ గని
నెమ్మదిలో మెచ్చుకొనెడు నేర్పరి తనమౌ!


5. రాధిక నోరి

సక్రమముగ పేర్చిన దీ
చక్రవ్యూహంబొ! లేక శతపత్రమొ! త్రై
విక్రముని చేతి కుదురయి
అక్రమముల నణచివేయు నాయుధమిదియే!


6. డా. ఎం. ప్రవీణ్ కుమార్ ఆచార్య

గాంగేయు దాహముడమును
గంగను దెప్పించె రంగ కదనమునందున్
మంగళమయునిన్ గౌరవ
సంగమ్మున నిలుపె సవ్య సాచియె తలపన్


7. పద్మజ శొంఠి

చెలగు నట్టి క్షుద్ర జీవిక యేనియు
కపియు నేని, పక్షి కవయునేని
రామ సేవలోన రాణించి తరియించె
అట్టి రామచంద్రు నాత్మ దలతు


8. విజయ్ రెడ్డివారి

కులములేదు మతము గూడంగ నదిలేదు
జాతి భేదమనెడు క్షణము లేదు
నేడు జగమునందు పీడయై వ్యాపించె
ముక్కు మూసుకొనెడి యిక్కటొకటి


9. విజయ జ్యోతి.

తండ్రి చెంత నుండి తరియించు భీష్మునిన్
చూచి మురిసి నట్లు చోద్యమంది
తండ్రి సుతునికేలు తగబట్టి చూపెట్టు
గొప్ప సంద్రమిద్ది చెప్పుకొనగ


10. జగదీశ్, చికాగో.

తల్లి యాది గురువు తగనేర్పు వర్ణాలు
తండ్రి పిదప కరపు దైవ భక్తి
శిక్షణంబు పూని సేవించు వారికి
ఆదిదేవులగుచు నలరు వారు


11. వాసు విశ్వనాథ.

చూడదు భూతమ్మొకటి
పోడిమి వినదొకటి యొకటి భుజియింపదునున్
వీడక సందేశమ్ముల
వీడునటా గ్రంథముఖిని వేరొకటదియే!


12. సురేశ్ సోమయాజుల

లోకావృతమై చెలగెడు
కాకుస్థుని రమ్యచరిత కావ్యంబనగా
లోకులకు నందజేసిరి
ఆ కామిత మూర్తి గొలుతు నానందముగా!


13. శారదా మల్లావజ్ఝల

భేదము లేదని తెలుపగ
వాదములన్ దైవములకు వచ్చిరి చూడన్
శ్రీ దయిత నన్నపూర్ణయు
నా దర్శనమిచ్చె హరుడు నవనీశుండున్


14. సాయి ప్రభాకర్ ఎర్రాప్రగడ.

స్వరవిపంచినినాదించు సవ్యసాచి
కచ్ఛపిన్ గల మెట్లను గౌరవింప
కనగ జేరెను బ్రహ్మ లోకమును బాలు
మధుర మోహన గీతాల మనన జేయ


15. ప్రసాద్ తుర్లపాటి.

పుండ్రముల స్వామి మోహన మూర్తి యచును
కలియుగమ్మున వెలసిన ఘనుడతండె
ఆర్తులను దీర్చి కాపాడు నఘవిదారి
కాన పట్టుడు మ్రొక్కుచు నతని దారి


16. ఈశ్వరి కొమరిగిరి.

అదెయె శివాలాస్యముగా
వదనమ్మున హావభావ వర్చస్సమరన్
పదిలంబొనరించెన దీ
సుదతియె నర్తించువేళ సూనృతమనగా


17. కృష్ణ కొమరగిరి.

ఎచట నుండు జుగుప్స తానచటనుండు
అందమనియెడు రీతిగా నందగించి
ఎచట నుండునొ బాధ తా నచట నుండు
సౌఖ్యమను సూక్తి తెలిపెడు సత్యమిదియె!


18. గాయత్రి తాడేపల్లి.

కల్యాణ రామ మూర్తిని
కల్యాణిని సీత జూడ కల్యాణమ్మే
కల్యాణప్రియులకుభువి!
కల్యాణమయమ్ముగాదె కన చిత్రమ్మే!


19. అనిల్ చింతలపాటి

తాళి గట్టెడు శుభవేల తలచు కొనగ
బందువిప్పుడు దరిచే వలదటంచు
ఆంక్ష లున్నట్టి వేలలో కాంక్షదీర
జాలవేదిక కొలువుకా జాలె జూడు


20. గిరిజా కుమారి.

మంచి చెడ్డల నేర్పును మమత తోడ
మాతృమూర్తియే సంతతి మనసులెరిగి
యట్టి తల్లికి నందించి హస్తయుగము
సుదతు లొప్పారె డానంద శోభ యదియె!


21. అరవింద పప్పు

వింతలలో వింతగునిది
అంతయు పరికించి జూడ నగు వృక్షమ్మే
ఇంతగు కళ్ళం గల్గిన
పొంతనగల చిత్రరాజమున్ నుతియింతున్


22. మధు చెరుకూరి.

పాత్రల నిష్టము గలిగిన
పాత్రుడిగా నెంచె భార్య పతినిటు జేసెన్
చిత్రమ్మున నాత్రముతో
సూత్రమ్మగు బాపుగారి శుభహాస్యమునన్


23. విజయ్ రెడ్డివారి

జరుగు చుండె నిపుడు శతవధానమ్ముగా
అందజేయ ప్రశ్నలందుకొనగ
వేయి పనుల తోడ వీక్షింప మిన్నగా
నదిగొ శారద అట నలరుచుండె!


మీ స్పందన తెలియజేయండి

Reach us via Email or follow us on social icons below. Thank you.