సమస్యలు
పృచ్ఛకుని పేరు | సమస్య | పూరణ | Audio-link | |
1. | డా. జోశ్యభట్ల రాజశేఖర్ | శారదకు బాధ కలుగగ శాంతి మనకు |
చేయ నష్టావధానమ్ము స్థిరము మీర నంశములయందు భావమ్ములందగింప నందు నప్రస్తుతమ్ముగా నమరియున్న శారదకు బాధ కలుగగ శాంతి మనకు |
|
2. | నల్లాన్ చక్రవర్తుల కిరణ్ (నచకి) | రామమందిరమ్ములేల రాక్షసుల యుపేక్షలో |
శ్రీమహాహరిన్ కనంగ సిద్ధరూపుడౌ భువిన్ క్షేమమున్ దలిర్పగా ప్రకీర్తికాంత భర్తయై ఈ మహిన్ వరింపవచ్చె - నెంచ జాలు హృద్ధ్వనిన్ రామమందిరమ్ములేల రాక్షసుల యుపేక్షలో |
|
3. | డాక్టర్ శేషం సుప్రసన్నాచార్యులు | కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై! |
అన్నులమిన్నయైన మృదులాంగన చెంత వసంతసేనకున్ మన్నన చేయు భంగి మొహమాటపు మాటల మాటగాడిగా ఎన్నొ విధాల పల్కెనిటు నెన్నగ బేల! శకారుడక్కటా! "కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై!" |
|
4. | నేమాని శశకళ | గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద! లంకాపట్టణంబున్ వడిన్! |
ఉద్వేగంబున తారకాపథమునం దుత్సాహమేపారగా విద్వన్మూర్తి శుభప్రయాణ గరిమన్ వేగంబుమై జేరి, శ్రీ మద్విఖ్యాత మహీజగాంచె పయినన్ మండించె క్షిప్రాశు రం గ-ద్వాల ప్రభవాగ్ని; కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్! (రంగత్ + వాల) |
|
5. | నేమాని రామకృష్ణ | ధనమే ముఖ్యమటంచు నేర్పవలె విద్యా బుద్ధులన్ సద్గురుల్! |
వినుడోయంచు హితోపదేశమున తా విన్పించె నారాయణుం డనయంబున్ నరుడొందుచున్ ఘనముగా నార్జింపగా ద్రవ్యమున్ కనగా లేవు! జరామృతుల్! సతమదే కాంక్షించి - లబ్ధిన్ గొనన్ ధనమే ముఖ్యమటంచు నేర్పవలె విద్యా బుద్ధులన్ సద్గురుల్! |
|
6. | డా. వేంకట శ్రీనివాస్ పులి | పరుల హితంబు గోరెడు కృపామయుడే పతితుండు నాఁ దగున్! |
స్థిరమతి యౌచు సేవలిడి, చెయ్వుల మంచినొనర్చి యెంతయున్! కరము ధనార్తులన్ గనుచు కామితముల్ నెరవేర్చుచుండినన్! పరులను త్రెళ్ళజేయక యపాయము నెంచక యున్న - "ఎన్నికన్" పరుల హితంబు గోరెడు కృపామయుడే "పతితుండు" నాఁ దగున్! |
|
7. | చంద్రశేఖర్ ఉపాధ్యాయుల | గాడిదనెక్కి శంకరుడు గంగను గైగొనిపోయె కాశికిన్! |
ఏడుకునేండ్లు మాట తరియింపగ ముక్తిపథంబు భార్యయే తోడుగ గంగరాగ నొక తోరపు భక్తుడు గుర్రమొక్కటిన్ బాడుగనాగ తెచ్చె, నది పారగ, చేసెడిదేమిలేకయే గాడిదనెక్కి శంకరుడు గంగను గైగొనిపోయె కాశికిన్! |
|
8. | కృష్ణ వేదుల | విషమును త్రాగె మాధవుడు వింతనుచున్ పరమానురక్తితోన్! |
కృషిగని దేవదానవుల కింకను మాన్పగ నాదిదేవుడే విషమును త్రాగె; మాధవుడు వింతగుచున్ పరమానురక్తితోన్ ధిషణ చెలంగ మోహినిగ దివ్యసుధారస మొప్పుగా భళీ సుషమ వహింప దేవతల సొత్తుగ జేసె శుభౌచితీక్రియన్! |
|
9. | వేణు దశిగి | వార్ధక్యంబున ప్రేమగీతి పలికెన్ వాత్సల్య ముప్పొంగగాన్! |
దోర్ధీరత్వము సన్నగిల్లె, పలుకున్ దోషప్రయుక్తంబునై నిర్ధారింపగలేక రాజ్యరమనే, నిద్రించు నిశ్చేష్టుడై, వర్ధిష్ణున్ - సుతునిన్ - యయాతి యడిగెన్ ప్రాయంబు - పూరుండిడన్ వార్ధక్యంబున ప్రేమగీతి పలికెన్ వాత్సల్య ముప్పొంగగాన్! |
|
10. | సత్యనారాయణ మూర్తి మధిర | రాముడు గాదు రాముడట రామచరిత్రను చూచినంతటన్ |
ధీమహితత్త్వమున్ చెలగ దిక్కుల యందున శాంతినిండగా ప్రేమయె శాశ్వతంబని వరింపగ సత్యము బోధసేసె; నే మేమి వచించినన్ పిఠకమేయని యందు తథాగతుం గనున్ రాముడుగాదు రాముడట - రామచరిత్రను చూచినంతటన్ |
|
11. | రోహిత్ ఆదిపూడి | వాగ్జ్యోతిన్ వెలిగించి దానవుడు సంపాదించె వాణీకృపన్! |
సృ గ్జ్యాముక్త విశేషవాక్కులనగా క్షేమంబుమై గూర్చు ద్యో ది గ్జ్యో తిష్యమునందు నొజ్జయగుచున్ దీవ్యత్ ప్రభారాశిచే వాగ్జ్యోతుల్ వెలిగించె శుక్రుని గనన్ భవ్యంబునౌ నీతితో వాగ్జ్యోతిన్ వెలిగించి దానవుడు సంపాదించె వాణీకృపన్! |
|
12. | సురేశ్ కొలిచెల | వాని పేరట సారంగధరుండు రాడట పదే రమ్మంచు ప్రార్థించినన్ |
జటలన్ గల్గిన వాని, జన్మ నుడుపన్ జాలంగ దక్షుండునౌ నిటలాక్షున్, పతిగాగ కోరుకొనుచున్ నిష్ఠాగరిష్ఠాత్మయై జటిలంబైన తపస్సునన్ గిరిజ - యోజన్ పిల్చెనే - వాని పే రట "సారంగధరుండు" రాడట పదే రమ్మంచు ప్రార్థించినన్! |
|
13. | శ్రీనివాస్ భరద్వాజ కిశోర్ (కిభశ్రీ) | అత్తను నమ్మబోకుమని అవ్యయుడే తన జామితో ననెన్! |
"చిత్తము నందునుండు, తన చిత్తము మెచ్చెడు భంగి నేగు, నై మిత్తిక కర్మలన్ గనగ మిశ్ర ఫలంబుల నిచ్చుచుండు, నా ’విత్తము’గా గుణాగుణ సువీక్షణముల్ ’రమ’ యెంచదంచు మీ అత్తను నమ్మబోకుమని" ’అవ్యయు’డే తన ’జామి’తో ననెన్! |
|
14. | శ్రీనివాసరావు అయినాపురపు | భార్యను కష్టపెట్టుటయె భర్తకు ముఖ్యము మెప్పునందగాన్! |
భార్య భరించునట్టిదని భాగ్యవతంసులు చెప్పవింటి, యా భార్య దధి ప్రమాణమయి భారము చే నవనీతమిచ్చు, యా భార్యయె కష్టకాలమున భర్తకు దన్నుగ నిల్చియుండు, త ద్భార్యను కష్టపెట్టుటయె భర్తకు ముఖ్యము మెప్పునందగాన్! |
|
15. | రమాకాంతరావు చాకలకొండ | రామభక్తులలో మేటిరతనాలు రాజత్రయము మించు రాజులేరి? (మహాక్కర) |
భీమయుద్ధంబు చేయగా వరలె విభీషణున్ మించిన యొకడులేడు; స్వామి వాహిని దాటింప నావలో సద్భక్తిచూపిన జాణలేడు; ధీమహత్వము నిండగా కపులచే దేవిని వెతకించు దిట్టలేడు; రామభక్తులలో మేటిరతనాలు రాజత్రయము మించు రాజులేరి? (విభీషణుడు, గుహుడు, సుగ్రీవుడు) |
|
16. | హరనాథ్ గానుగపాటి | కృష్ణను, కృష్ణునిన్ మరియు కృష్ణుని జూచితి భారతంబునన్! |
కృష్ణుడనంగ నర్జునుడు - కృష్ణయె ద్రౌపది యౌ నెఱింగినన్ కృష్ణుడనంగ వ్యాసుడట; కృష్ణమయంబగు నేత్రపర్వమా కృష్ణ కథాంకురమ్ము పరికింపగ నా ’జయ’ కావ్య; మట్లుగా కృష్ణను కృష్ణునిన్ మరియు కృష్ణుని జూచితి భారతంబునన్! |
|
17. | శఠగోపన్ శ్రీవాత్సవ శేషం | మక్కాబోవలె వేంకటేశ్వరునికిం సంప్రీతిగా మ్రొక్కగన్! |
"ఇక్కట్లెన్నియొ గల్గగా, ముడుపులందివ్వంగ నా స్వామికిన్ చక్కంబెట్టెడు నాథుడంచు కడితిన్ స్వాంతంబు రంజిల్లగా నక్కో! యెయ్యడ బెట్టినావు? గొనితేవమ్మాయి! యీ ముడ్పు! రా మక్కా బోవలె వేంకటేశ్వరునికిం సంప్రీతిగా మ్రొక్కగన్!" |
|
18. | శ్రీ రామచంద్ర రావు తల్లాప్రగడ | ఆత్మగరుత్ముండయ్యె నాశ్చర్యముగన్! |
ఆత్మీయులెల్ల జేరుచు నాత్మారాముండు నలర నతినందమిడన్! నాత్మ గృహమ్మును జేరగ ఆత్మగరుత్ముండయ్యె నాశ్చర్యముగన్! |
|
19. | పుల్లెల శ్యామసుందర్ | క్రుళ్ళిన వంకాయమేలు కూరకు, నెపుడున్! |
అల్లారు ముద్దుసేయక పళ్ళెరమున కూర సర్దు పద్ధతి తెలుపన్ ఇల్లాలిని పతియిటులనె క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు,నెపుడున్! |
|
20. | కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి | అన్నయు దమ్ముడున్ బెనగ నాతురజెందిరి శక్రగోపకుల్! |
వెన్నుడు కేలనెత్తగను వేడుకతో గిరినిల్చు ఠేవకున్ పన్నము నట్లు రాళ్ళు తెగ వర్షము నట్లుగ నేగుదెంచగా మిన్నును భూమియున్ కలియ మిక్కిలి ఘర్షణమందె నయ్యెడున్ అన్నయు దమ్ముడున్ బెనగ నాతురజెందిరి శక్రగోపకుల్! |
|
21. | కిరణ్ సింహాద్రి | ఎలుక వధించె నేనుగు నహీన బలంబున విక్రమించుచున్! |
చెలగ మహారణంబు విరచించిన యట్టి పర ప్రవాహినిన్ అలుగులు ఖడ్గధారల నొకానొక వీరుడు బాలచంద్రుడున్ కలియగ జొచ్చి చంప నలగాముని, చంపె నృసింహరాయనిన్! ఎలుక వధించె నేనుగు నహీన బలంబున విక్రమించుచున్! |
|
22. | శ్రీధర్ బిల్ల | రామపదము తాకి నాతి రాతిగమారెన్! |
కామక్రోధములెల్లడ స్వామీ పెల్లుబికె ననుచు సంవేదనతో ఈ మహి కలియుగమందున రామపదము తాకి నాతి రాతిగమారెన్! |
|
23. | సుబు భాగవతి | కాశ్మీరంబున వెన్నెలల్ గురిసెగా కంజాప్తునిన్ గాంచినన్! |
రశ్మిన్ గ్రక్కుచు గ్రీష్మ తాపమున నుగ్రావస్థతో భానుడే అశ్మంబుల్ చెదరంగజేయ నకటా నార్తుల్ వ్యధల్ నిండెనే కాశ్మీరంబును మోది మోదమిడగా కల్పెంగదా భారతిన్ కాశ్మీరంబున వెన్నెలల్ గురిసెగా కంజాప్తునిన్ గాంచినన్! |
|
24. | ఆదిత్య ధవళ | హనుమంతుడు పెండ్లియాడె నవనిజ సీతన్! |
ఒనరంగ రామ నవమికి కనులకు పర్వంబు రామ కళ్యాణంబే! విను వీథి భజన సలుపగ హనుమంతుడు; పెండ్లియాడె నవనిజ సీతన్! |
|
25. | డా. చింతలపాటి మోహన మురళీ కృష్ణ | అస్ఖలిత బ్రహ్మచారికార్గురు పుత్రుల్! |
అస్ఖలితుండన సతియెడ నే స్ఖలనము వలన పుత్రినిన్ గొనగను వీ ర్య స్ఖలనము చేయునతడు; అస్ఖలిత బ్రహ్మచారికార్గురు పుత్రుల్! |
మీ స్పందన తెలియజేయండి
Reach us via Email or follow us on social icons below. Thank you.